ఈ నెల 30 న పోడు పట్టాల పంపిణీ

హైదరాబాద్‌:జూన్‌ 26
గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్నది. గోండువీరుడు కుమ్రంభీం పుట్టి న గడ్డ కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా నుంచే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. అదే రోజున మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి జిల్లాలు, నియోజకవర్గాల్లో పోడు పట్టాలను పంపిణీ చేస్తారు. వాస్తవానికి ఈ నెల 24 నుంచే పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినా, కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రంలో పర్యటిస్తుండటం, శుక్ర, శనివారాల్లో జిల్లా కలెక్టర్లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తుండటం, ఈ నెల 29న బక్రీద్‌ ఉన్నందున ముందు ప్రకటించిన తేదీని 30కి ప్రభుత్వం మార్చింది.

పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేసింది. అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఫారెస్ట్‌ కమిటీలను వేసి అర్హులైన పోడు రైతులను గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాలు, 295 మండలాలు, 2,845 గ్రామపంచాయతీల పరిధిలో ఈ ఫారెస్ట్‌ రైట్‌ కమిటీలు క్షేత్ర స్థాయిలో పరిశీలించాయి. రాష్ట్రంలోని 12,49,296 ఎకరాలకు సంబంధించి 4,14,353 క్లెయిమ్స్‌ను ఫారెస్ట్‌ కమిటీలు వివిధ స్థాయిలో పరిశీలించిన అనంతరం 28 జిల్లాల పరిధిలో 4,05,601 ఎకరాలకు సంబంధించి 1,50,012 మంది లబ్ధిదారులు పోడు పట్టాలు పొందేందుకు అర్హులు అని సర్కారు గుర్తించింది.

పకడ్బందీగా అటవీ యాజమాన్య హక్కులు


పోడు పట్టాల పంపిణీ తర్వాత అటవీ భూమి ఇంచు కూడా అన్యాక్రాంతం కాకుం డా ఉండేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకొంటున్నది.పాలిగన్‌ సాంకేతిక సహాయంతో పకడ్బందీగా పోడుభూముల పట్టా అటవీ భూ యాజమాన్య హక్కు ప్రతాలు ను రూపొందించింది. భూమి సర్వే నంబర్‌, పంపిణీ చేసే భూమి విస్తీర్ణం, ఆ భూమి ఏ అకాంక్ష, రేఖాంశాల మధ్య ఉన్నది? సంబంధిత భూమి హద్దులు ఏవి? వంటి అంశాలను గూగుల్‌ మ్యాపింగ్‌ వివరాలతోపాటు హోలోగ్రామ్‌ను అటవీ భూ యాజమన్య హక్కు పత్రంలో పొందుపరిచారు. దీంతో పంపిణీ చేసిన భూమి ఇరుగుపొరుగుతో భూ వివాదాలు లేకుండా చేస్తుంది. లబ్ధిదారుడి భూమి పక్కనే అటవీ భూమి ఉంటే ఆ భూమిని ఆక్రమించుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ టెక్నాలజీని వినియోగించింది.

హక్కు పత్రంపై నలుగురి సంతకాలు


అటవీ భూ యాజమాన్య హక్కు పత్రాల్లో మూడు శాఖల అధికారులు, లబ్ధిదారుడి సంతకాలను పొందుపరచనున్నారు. భూ యాజమాన్య హక్కు పత్రాలపై గిరిజన, అటవీ, రెవెన్యూ అధికారుల సంతకాలు ఉండేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నది. లబ్ధిదారుని ఫొటోనూ సైతం ఇందులో పొందుపరిచారు. రాష్ట్రంలోని 26 జిల్లాల పరిధిలో 4,05,601 ఎకరాల అటవీ భూమిని 1,50,012 మందికి అందించనున్నారు.

భద్రాద్రి కొత్తగూడెంలో హరీశ్‌, మానుకోటలో కేటీఆర్‌


కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో సీఎం కేసీఆర్‌ పోడుభూముల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించే రోజే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌ గిరిజనులకు పోడుపట్టాలు పంపిణీ చేయనున్నారు. మహబూబాబాద్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌ వరింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌, రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి పోడు పట్టాలు పంపిణీ చేయనున్నారు.

ఈ వానకాలం నుంచే రైతుబంధు

భూ యాజమాన్య హక్కు పత్రాలు స్వీకరించే గిరిజన రైతులకు సర్కారు ఈ వానాకాలం సీజన్‌ నుంచే రైతుబంధును అందించనున్నది. ఇందుకు కావాలసిన ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్‌ సంబంధిత జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో 26 జిల్లాల కలెక్టర్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు తెరిచే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాల వారీగా పోడు అర్హుల జాబితాను గిరిజన సంక్షేమశాఖ వ్యవసాయశాఖకు అప్పగించింది. క్షేత్రస్థాయిలో అధికారులు బ్యాంకు ఖాతాలు తెరిపించి, వివరాలు సేకరిస్తున్నారు.

30నే కలెక్టరేట్‌, ఎస్పీ ఆఫీస్‌ ప్రారంభం

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయాన్ని పోడు భూములు పంపిణీ చేసే రోజే ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. కలెక్టరేట్‌తోపాటు జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం పోడు భూముల పంపిణీ కార్యక్రమం సందర్భంగా నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు…..

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!