వందల వాహనాలతో భారీ కాన్వాయ్..
కదలనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
మహారాష్ట్రలో కారు దౌడు తీస్తున్నది. 11 లక్షల మంది కమిటీ సభ్యుల సైన్యంతో బీఆర్‌ఎస్ కవాతు చేస్తున్నది. మరో 15 రోజుల్లో ఆ సైన్యం 30 లక్షలకు చేరుకొంటుందని మహారాష్ట్ర బీఆర్‌ఎస్ విభాగం తెలిపింది. ఈ చైతన్యాన్ని మరింత పరుగులు పెట్టించేందుకు పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్యనాయకులతో నేడు, రేపు (సోమ, మంగళవారం) మహారాష్ట్రలో పర్యటించనున్నారు.
2 రోజులపాటు ముఖ్యమంత్రి పర్యటన.. విఠలేశ్వరుడు, తుల్జాభవానీ దర్శనం
బీఆర్‌ఎస్‌లోకి పలువురు భీవండి నేతలు..
ఎన్సీపీ, కాంగ్రెస్ నాయకుల చేరిక
నేడు, రేపు మహారాష్ట్ర పర్యటన
రోడ్డుమార్గంలో భారీ కాన్వాయ్‌తో పయనం
సీఎం వెంట మంత్రులు, ప్రజాప్రతినిధులు
విఠలేశ్వరుడు, తుల్జాభవానీ దర్శనం
నాడు చలో ఢిల్లీ.. నేడు పండరీపురం ఉద్యమ కాలాన్ని గుర్తుకు తేనున్న పర్యటన
మహారాష్ట్రలో కారు దౌడు తీస్తున్నది. 11 లక్షల మంది కమిటీ సభ్యుల సైన్యంతో బీఆర్‌ఎస్ కవాతు చేస్తున్నది. మరో 15 రోజుల్లో ఆ సైన్యం 30 లక్షలకు చేరుకొంటుందని మహారాష్ట్ర బీఆర్‌ఎస్ విభాగం తెలిపింది. ఈ చైతన్యాన్ని మరింత పరుగులు పెట్టించేందుకు పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్యనాయకులతో నేడు, రేపు (సోమ, మంగళవారం) మహారాష్ట్రలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు భారీ కాన్వాయ్‌తో ప్రగతిభవన్ నుంచి రోడ్డు మార్గాన మహారాష్ట్ర పర్యటనకు బయలుదేరనున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ (నాడు టీఆర్‌ఎస్) ఆవిర్భవించిన తొలినాళ్లలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఢిల్లీకి వినిపించేందుకు ‘చలో ఢిల్లీ ‘ పేరుతో భారీ కారు ర్యాలీ నిర్వహించిన తరహాలోనే నేడు ప్రగతిభవన్ నుంచి పండరీపురం యాత్రకు బయలుదేరాలని నిర్ణయం తీసుకోవటంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
ఒమర్గాలో మధ్యాహ్న భోజనం..సోలాపూర్‌లో రాత్రి బస
సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రగతిభవన్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లా ఒమర్గాకు మధ్యాహ్నం 1 గంటకు చేరుకొంటారు. ఒమర్గాలో మధ్యాహ్న భోజనం చేసి, అక్కడి నుంచి సాయంత్రం 4.30కి సోలాపూర్ బయలుదేరుతారు. రాత్రి సోలాపూర్‌లోనే బస చేస్తారు. మంగళవారం ఉదయం 8 గంటలకు సోలాపూర్ నుంచి పండరీపురం చేరుకుంటారు. విఠోభారుక్మిణి మందిర్‌లో సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత సోలాపూర్ జిల్లా సర్కోలి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సభలోనే సోలాపూర్ జిల్లాలో ప్రముఖ నాయకుడు భగీరథ్ బాల్కే సహా పలువురు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడి నుంచి ధారాశివ్ జిల్లాలోని శక్తిపీఠమైన తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హైదరాబాద్‌కు పయనమవుతారు. కేసీఆర్ పర్యటనకు మహారాష్ట్రలోని బీఆర్‌ఎస్ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశాయి. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, కార్పొరేషన్ చైర్మన్ సముద్రాల వేణుగోపాలాచారి, మహారాష్ట్ర నేత మాణిక్ కదం తదితరులు ఈ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. సీఎం కేసీఆర్ వెంట వెళ్లే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నిర్దేశిత సమయానికి ప్రగతి భవన్ చేరుకోవాలని సమాచారం అందించారు.
నాడు ఢిల్లీ.. నేడు పండరీపురం
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కేసీఆర్ ‘చలో ఢిల్లీ’ కార్యక్రమానికి పిలుపునిచ్చి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి భారీ కార్ల ర్యాలీని (మార్చి 27, 2003వ తేదీన) చేపట్టి యావత్ దేశ దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ విజృంభిస్తున్నది. సీఎం కేసీఆర్ ఇచ్చిన ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదం మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నది. ఈ సమయంలో నాటి చలో ఢిల్లీని తలపిస్తూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులతో కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటించేందుకు రోడ్డుమార్గాన్ని ఎంచుకోవటం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది.