‘మేం గెలిస్తే కళ్యాణ కర్ణాటకలో ప్రతి గ్రామానికి రూ. కోటి ఇస్తాం.’ – కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ
‘కళ్యాణ కర్ణాటక అభివృద్ధి కోసం ఒక్క 2023 బడ్జెట్‌లోనే మేం రూ. 5 వేల కోట్లు ఇచ్చాం’ – బీజేపీ నాయకులు
కళ్యాణ కర్ణాటక అభివృద్ధికి రూ. 5 వేల కోట్లు ఇస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించగా, తాము ఒక్క ఏడాదిలోనే అంత డబ్బు ‘కళ్యాణ కర్ణాటక ప్రాంత అభివృద్ధి బోర్డు’(కేకేఆర్‌డీబీ)కి ఇప్పటికే ఇచ్చామని కర్ణాటకలోని పాలక బీజేపీ నేతలు చెప్తున్నారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత ప్రాంతమైన కళ్యాణ కర్ణాటకలో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తుండగా, ఎలాగైనా ఈసారి అక్కడ తమ పట్టు పెంచుకోవాలన్న లక్ష్యంతో బీజేపీ మాజీ సీఎం యెడియూరప్ప, ప్రస్తుత సీఎం బసవరాజ బొమ్మై ఆ ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఇంతగా అందరి నోళ్లలో నానుతున్న ఈ ‘కళ్యాణ కర్ణాటక’ ఏమిటి? ఎక్కడుందీ ప్రాంతం? రాజకీయంగా దీనికి ఎందుకింత ప్రాధాన్యం?
మొన్నటి వరకూ ‘హైదరాబాద్ కర్ణాటక’
కర్ణాటకలో వెనుకబడిన మెట్ట ప్రాంతం ఈ కళ్యాణ కర్ణాటక. ఒకప్పుడు నిజాం రాజుల పాలనలో ఉన్న ఈ ప్రాంతాన్ని దాదాపు నాలుగేళ్ల కిందటి వరకు కూడా ‘హైదరాబాద్ కర్ణాటక’ అని పిలిచేవారు.
హైదరాబాద్ సంస్థానం 1948లో భారతదేశంలో విలీనమైంది. అనంతరం 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో హైదరాబాద్ సంస్థానంలోని కొంత ప్రాంతం కర్ణాటక రాష్ట్రంలోకి, కొంత ఆంధ్రప్రదేశ్(ఉమ్మడి) రాష్ట్రం పరిధిలోకి వచ్చాయి.
కర్ణాటకలోని హైదరాబాద్ సంస్థాన ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ‘హైదరాబాద్ కర్ణాటక రీజియన్ డెవలప్‌మెంట్ బోర్డ్’ను 2013లో ఏర్పాటు చేశారు. 2019లో ఈ ప్రాంతం పేరు మార్చిన తరువాత ఈ బోర్డ్ పేరు కూడా ‘కళ్యాణ కర్ణాటక రీజియన్ డెవలప్‌మెంట్ బోర్డ్’గా మార్చారు.
2019 సెప్టెంబర్ 17న ఈ ప్రాంతం పేరును కళ్యాణ కర్ణాటకగా మారుస్తూ అప్పటి సీఎం యెడియూరప్ప ప్రకటించారు. ఆ ప్రాంత ప్రజల చిరకాల డిమాండ్ మేరకు పేరు మార్చామని, ఆ ప్రాంతం కోసం ప్రత్యేక సెక్రటేరియట్ ఏర్పాటు చేస్తామని కూడా ఆయన చెప్పారు.
యెడియూరప్ప చెప్పినట్లు కళ్యాణ కర్ణాటకకు ప్రత్యేక సెక్రటేరియట్ అయితే ఇంతవరకు ఏర్పాటు చేయలేదు.
కళ్యాణ కర్ణాటకలో ఏయే జిల్లాలున్నాయి?
బీదర్, బళ్లారి, కలబురిగి, కొప్పల్, రాయిచూర్, యాదగిరి జిల్లాలు కళ్యాణ కర్ణాటకలో ఉన్నాయని ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన ‘కళ్యాణ కర్ణాటక రీజియన్ డెవలప్‌మెంట్ బోర్డ్’ చెప్తోంది.
2021 అక్టోబరులో బీదర్ జిల్లాలోని కొంత ప్రాంతాన్ని విజయనగర జిల్లాగా ఏర్పాటు చేశారు. దీంతో కళ్యాణ కర్ణాటకలో జిల్లాల సంఖ్య ఏడుకి పెరిగింది.
ఈ ఏడు జిల్లాల పరిధిలో మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.
కర్ణాటకలో ఆవులను తీసుకెళ్తున్న ముస్లిం డ్రైవర్‌పై ‘గోరక్షకుల’ మూక దాడి, హత్య: అసలేం జరిగింది?
కర్నాటక: ‘‘మైకుల్లో ప్రార్థించకుంటే అల్లాకు వినపడదా..’’ బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు… మరి నిబంధనలు ఏం చెబుతున్నాయి
ఇద్దరు సీఎంలను, ఇద్దరు కాంగ్రెస్ అధ్యక్షులను ఇచ్చిన నేల
కర్ణాటకకు గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వీరేంద్ర పాటిల్, ధరమ్‌సింగ్ కళ్యాణ కర్ణాటక ప్రాంతంవారే.
వీరంద్ర పాటిల్ కలబురిగి జిల్లాలోని చించోలికి చెందినవారు. ధరమ్ సింగ్ అదే జిల్లా నెలోగికి చెందినవారు.
1968లో వీరేంద్ర పాటిల్ ముఖ్యమంత్రి పదవి చేపట్టగా, 2004లో ధరమ్ సింగ్ సీఎం అయ్యారు.
కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రులైన ఈ ఇద్దరూ కూడా అయిదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకోలేకపోయారు. వీరేంద్ర పాటిల్ సుమారు మూడేళ్లు పదవిలో ఉండగా, ధరమ్ సింగ్ రెండేళ్లే సీఎంగా ఉన్నారు.
ఏఐసీసీ అధ్యక్షులు అయిన ఇద్దరు కర్ణాటకవాసులు నిజలింగప్ప, మల్లికార్జున ఖర్గే కూడా కళ్యాణ కర్ణాటక ప్రాంతీయులే.
నిజలింగప్ప ప్రస్తుత విజయనగర జిల్లాకు చెందినవారు. మల్లికార్జున ఖర్గేది బీదర్ జిల్లా.
ప్రత్యేక రాష్ట్ర డిమాండ్
కళ్యాణ కర్ణాటక ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలన్న డిమాండ్ కొంత కాలంగా ఉంది.
అనేక సందర్భాల్లో ఇక్కడి సంస్థలు కొన్ని ఈ డిమాండ్ వినిపించాయి. ఇందుకోసం ఆందోళనలు చేశాయి.
రాజకీయ నాయకులు కూడా కొందరు ఇలాంటి డిమాండ్ వినిపించారు.
‘ప్రత్యేక కళ్యాణ కర్ణాటక పోరాట సమితి’ అనే సంస్థ ఏటా ఈ ప్రాంతంలో నిరసనలు చేపడుతోంది. కలబురిగి, యాదగిర్, బీదర్, కొప్పల్, బళ్లారి జిల్లాల్లో అభివృద్ధి ఏమాత్రం లేదని, తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఈ డిమాండ్ చేస్తోంది.
కాంగ్రెస్, బీజేపీలలో ఏ పార్టీకి పట్టుంది?
40 అసెంబ్లీ సీట్లున్న కల్యాణ కర్ణాటకలో ఏ పార్టీకి పట్టుందో ఓసారి చూద్దాం.
ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీలే ఇక్కడ ఎక్కువ సీట్లు గెలుస్తూ వస్తున్నాయి.
2018 ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ 22 సీట్లు గెలవగా, బీజేపీ 15, జేడీఎస్ 4 దక్కించుకున్నాయి.
అంతకుముందు 2013లో కాంగ్రెస్ 23 సీట్లు, బీజేపీ 12, జేడీఎస్ 5 సాధించాయి.
2013 ఎన్నికల సమయంలో యెడియూరప్ప బీజేపీ నుంచి బయటకొచ్చి ‘కర్ణాటక జనతా పక్ష’ పార్టీ ఏర్పాటు చేయడం, గాలి జనార్దన్ రెడ్డి సన్నిహితుడు బి.శ్రీరాములు కూడా బీఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడంతో బీజేపీ ఆ ఎన్నికల్లో కళ్యాణ కర్ణాటకలో 12 సీట్లకే పరిమితమైంది. 2018 నాటికి యెడియూరప్ప తిరిగి బీజేపీలోకి వచ్చేశారు.
ప్రస్తుతం గాలి జనార్దన రెడ్డి నెలకొల్పిన ‘కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష’ కూడా 2023 ఎన్నికల బరిలో ఉంది.
తెలుగువారు ఎక్కువే
కళ్యాణ కర్ణాటకలో తెలుగువారి జనాభా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటుందని అనంతపురానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ జి.నాగభూషణం చెప్పారు.
కళ్యాణ కర్ణాటక రీజియన్ డెవలప్‌మెంట్ బోర్డుకు గత రెండు బడ్జెట్లలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం ద్వారా బీజేపీ పట్టు కోసం ప్రయత్నిస్తోందని, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సొంత ప్రాంతం కావడంతో ఆయన కూడా ఇక్కడ వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించేలా ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
జేడీఎస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తన పంచరత్న యాత్రలో భాగంగా ఈ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారన నాగభూషణం ప్రస్తావించారు.
కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ కుమారస్వామికే మద్దతు ప్రకటించిందని, ఇవన్నీ ఈ ప్రాంత రాజకీయాలను ప్రభావితం చేసే అంశాలేనని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణలాగే..
కళ్యాణ కర్ణాటక ప్రాంతం ఒకప్పుడు నిజాం పాలనలో ఉండడంతో తెలంగాణ సమాజం ఎదుర్కొన్నట్లే ఇది కూడా రజాకార్ల దౌర్జన్యాలను, పీడనను చూసింది.
తెలంగాణకు పొరుగునే ఉన్న జిల్లాల్లో సాంస్కృతికంగా, సామాజికంగా ఎన్నో సారూప్యాలు కనిపిస్తాయని, తెలంగాణకు చెందినవారు కూడా ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉన్నారని, రెండు ప్రాంతాల మధ్య సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని నాగభూషణం చెప్పారు.
ఈ కారణంగానే కర్ణాటకలోని ఈ ప్రాంతంపై బీఆర్‌ఎస్ దృష్టి పెట్టిందని, ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం పోటీలో లేకుండా జేడీఎస్‌కు మద్దతు పలికిందని చెప్పారు.